కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ దేశం లోని అన్ని వర్గాలను నిరాశకు గురి చేసింది.కేంద్రం ఈ బడ్జెట్ లో ప్రకటించినట్లుగా ఆత్మ నిర్భర్ బడ్జెట్టుగా కాకుండా ఆత్మ నిబ్బరం ఇవ్వలేని పేలవమైన బడ్జెట్ గా నిలిచిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాల పరిమితి దాటిన పాత వాహనాలను దశల వారీగా తుక్కుగా మారుస్తామని ప్రకటించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రోజు రోజుకూ భారంగా మారుతున్న వాయు కాలుష్య సమస్యలను తీర్చేందుకు పాత వాహనాలను తుక్కుగా మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల ఓల్డ్, అన్‌ఫిట్ వాహనాలను తుక్కుగా మార్చనున్నారు.
పర్సనల్ వెహికిల్స్‌కు 20 ఏళ్లు, కమర్షియల్ వెహికిల్స్‌కు 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ పరీక్షలు ఉంటాయన్నారు. అయితే ఈ స్క్రాపింగ్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మంత్రి సీతారామన్ చెప్పారు. దీని వల్ల ఫ్యుయల్ ఎఫిషియంట్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వాహనాల వినియోగం పెరుగుతుందని మంత్రి తెలిపారు. పర్యావరణ అనుకూల వాహనాలతో కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతి బిల్లులు కూడా తగ్గనున్నట్లు మంత్రి చెప్పారు. ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్లలో వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్ష ఉంటుందన్నారు.