కర్ణాటక ఉద్యానయాత్రలో భాగంగా రెండవరోజు శుక్రవారం బెంగుళూరు లాల్ భాగ్‌లో ఉద్యాన రైతుల సహకార సంస్థ హాప్ కామ్స్, మదర్ డైరీ, సఫల్ యూనిట్లు, తిరుమ్ షెట్టి హల్లిలో రైతు ఆనందరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్నితెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయం వీసీ నీరజా ప్రభాకర్, కర్ణాటక ఉద్యానశాఖ డీడీ కెఎం పరాశివమూర్తి, ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయం నుండి కూరగాయల ఎగుమతులకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.జీఎంఆర్ సంస్థతో సమావేశం ఏర్పాటు చేయండి అని తెలిపారు. హైదరాబాద్ నలువైపులా మార్కెట్లు రావాలి. శంషాబాద్, వంటిమామిడి, ఇబ్రహీపట్నంలలో రైతు సహకార సంస్థ మార్కెట్లు ఏర్పాటు చేయాలి. దళారీ వ్యవస్థ పోయి రైతులు, వినియోగదారులకు నేరుగా సంబంధాలు ఏర్పడాలి. అప్పుడే రైతుల శ్రమకు తగిన గిట్టుబాటు ధరతో పాటు, వినియోగదారులకు సరసమైన ధరలకు పండ్లు, కూరగాయలు నాణ్యమైనవి అందుతాయన్నారు. కర్నూలు- హైదరాబాద్ జాతీయ రహదారిపై అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతి యూనిట్ ఏర్పాటు చేయండి.. ప్రభుత్వ సహకారం అందిస్తామని మంత్రి అన్నారు.
ఇక్కడ మదర్ డైరీ, సఫల్ యూనిట్ల ఉత్పత్తులు ఎంతో బాగున్నాయి. తెలంగాణలో ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయాలి.. రైతులతో నేరుగా సంస్థలే సంబంధాలు నెరపాలి. ఆ ఉద్దేశంతోనే బీచుపల్లిలో వేరుశనగ నూనె ఉత్పత్తి కేంద్రం, అశ్వారావుపేటలో ముడి ఆయిల్ పామ్ ఉత్పత్తికి ఆదేశాలివ్వడం జరిగింది. రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి కేంద్రాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ఉన్నారు. రైతుబంధు సమితిలు, రైతువేదికలతో తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.