బరిలో లేని ముఖ్యమంత్రి అభ్యర్ధులు

202
The netas are not contesting
- Advertisement -

రాజకీయాల్లో కొత్తట్రెండ్ నడుస్తుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల పై ఉత్కంఠనెలకొంది. ఇటు అధికార బీజేపీకి అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌కి ఎన్నికలు కీలకమైనవి. 2019 ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద రాష్ట్రమైన యూపీని అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. యూపీలో 70 ఎంపీ స్ధానాలున్న బీజేపీ అధికారం దక్కించుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తోంది. ఇక అధికార ఎస్పీ -కాంగ్రెస్‌తో జతకట్టి ముందుకుసాగుతోంది. మాయవతి నేతృత్వంలోని బీఎస్పీ, అజిత్ సింగ్‌ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ సైతం యూపీ పీఠాన్ని అధిష్టించడానికి పావులు కదుపుతోంది.

దీంతో యూపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఎస్పీ- కాంగ్రెస్, బీఎస్పీ,ఆర్‌ఎల్డీ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందువరుసలో నిలిచాయి. అయితే, ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు బరిలో నిలవడం లేదు. కేవలం ప్రచారానికే పరిమితమై పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పీఠాన్ని దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి కావాలంటే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి.. తన పార్టీని గెలిపించుకోవాలి. గెలిచిన శాసనసభ్యుల నాయకుడిగా ఎంపికవ్వాలి.. కానీ యూపీలో అవేమీ అక్కర్లేనట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తే. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఎస్పీ-కాంగ్రెస్‌ తరఫున కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా అఖిలేశ్‌ యాదవే. కానీ ఆయన ఎన్నికల్లో ఎక్కడ నుంచీ కూడా పోటీ చేయడం లేదు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఎన్నికల్లో పోటీచేయడం లేదు. రాష్ట్రీయ లోక్‌దళ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి జయంత్‌ చౌదరి కూడా ప్రజాతీర్పు కోసం బరిలో దిగి రిస్క్‌ తీసుకోవాలనుకోవడం లేదు. ఇక బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు ప్రకటించనే లేదు. గెలిచిన అభ్యర్థుల్లోంచి ఎంచుకుంటుందో, లేక కొత్తగా బయటినుంచి తెచ్చి ముఖ్యమంత్రిని నియమిస్తుందో తెలియదు. ఏడు విడతల్లో జరగనున్న యూపీ ఎన్నికలు ఫిబ్రవరి 11న ప్రారంభం కానున్నాయి. ఏ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థీ ఎన్నికల బరిలో లేకపోవడం ఈ ఎన్నికల విశేషమనే చెప్పుకోవాలి.

తొలుత కనౌజ్‌ నుంచి ఎంపీగా గెలిచిన అఖిలేశ్‌ కూడా ఆ తర్వాత మాయావతి బాటే పట్టారు. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఆయన పదవికాలం ఇంకో ఏడాది ఉంది. దీంతో ఎన్నికల బరిలో దిగాల్సిన అవసరం తనకు లేదని ఆయన ప్రకటించారు. మరోవైపు మాయావతి సైతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో ఆమె కూడా పోటీకి దూరంగానే ఉన్నారు. ఇక ఆర్‌ఎల్‌డీ నేత కూడా వీరి బాటే పట్టారు.

ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఒకటికన్నా ఎక్కువ సీట్లలో పోటీచేసేవారు. ఎందుకంటే వారి పోటీచేసిన ప్రాంతంతో పాటు ఇతర నియోజకవర్గాలపై ఆ ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తారు. కానీ యూపీలో మాత్రం సీన్ రివర్స్‌. అసలు పోటీయే చేయకపోవడం ఇప్పటి ట్రెండ్‌లా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- Advertisement -