ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని.. ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యా సంవత్సరాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి…. సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేపట్టాలన్నారు. వివిధ తరగతుల్లో సిలబస్ తగ్గింపుపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు.విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పాఠశాలకు హాజరవని విద్యార్థులకు ఆన్లైన్లో వినేలా ఏర్పాట్లు చేయాలని సూచించామన్నారు.
కరోనాపై అవగాహన కల్పిస్తూ.. విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించినట్లు చెప్పారు. పాఠశాలలకు సంబంధించి పలు సమస్యలను ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత వరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.