ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ ఇప్పటివరకు సరికొత్త ఫీచర్స్‌తో ఆకట్టుకోగా న్యూ ఇయర్ సందర్భంగా యూజర్స్‌కి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవసీ పాలసీ పేరుతో వాట్సాప్ తీసుకొచ్చిన విధానంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఆ సంస్థ వెనక్కితగ్గింది.
వాట్సాప్ అప్‌డేట్ అమలును కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై నెలకొన్న సందేహాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 8న కాకుండా.. పాలసీని మే 15వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీలో భాగంగా యూజర్ల డేటాను తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని వాట్సాప్ ప్రకటించింది. దీంతో వాట్సాప్ ఆటోమేటిగ్గా సేకరించే డేటా మొత్తం ఫేస్‌బుక్‌కు వెళ్లిపోతుంది. ఇందులో మీ మొబైల్ నంబర్, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చే కనీస సమాచారం లాంటివి ఉంటాయి. మీ డివైస్ నుంచి మీ కచ్చితమైన లొకేషన్‌ను కూడా మీ అనుమతితో తీసుకుంటుంది. ఈ సమచారాన్నంతా ఫేస్‌బుక్, దాని ఇతర ప్రోడక్ట్స్ కూడా ఉపయోగించే అవకాశం ఉండడంతో.. యూజర్లలో ఆందోళన మొదలైంది. ఇది గమనించిన వాట్సాప్.. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది.