అఖిల ప్రియ కేసులో కొత్త ట్విస్ట్‌..

191
Akhila Priya
- Advertisement -

హఫీజ్‌పేట్‌లో 25 ఎకరాల భూవివాదంలో కిడ్నాపింగ్‌‌కు పాల్పడిన నేరంతో ఏపీకి చెందిన టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాపింగ్ కేసులో తొలుత ఏ 1 ముద్దాయిగా ఏవీ సుబ్బారెడ్డి ఉండగా అఖిల ప్రియ ఏ2 ముద్దాయిగా ఉన్నారు. అయితే అఖిల ప్రియను విచారించిన అనంతరం ఏ2 గా ఆమె పేరును పోలీసులు ఏ1 గా మార్చారు. ఇక ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను ఏడురోజుల కస్టడీకీ ఇవ్వాలని కోరుతూ పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఆమె భర్తతో సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే టీడీపీలో కీలక నేత అయిన అఖిలప్రియ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కావున బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోర్టుకు తెలిపారు..

మరోవైపు అఖిలప్రియ గర్భవతి అని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో ఆమె తరపు న్యాయవాది మెమో దాఖలు చేసారు. అఖిలప్రియ జైళ్లో కింద పడిపోయారని, ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని తెలిపారు. ఆమెను చికిత్స కోసం వెంటనే ఈఎన్ టీ సర్జన్ వద్దకు తరలించాలని కోరారు. అంతే కాదు ఆమె గర్భవతి అని, తరచుగా ఫిట్స్ వస్తున్నాయని, కావున అఖిల ప్రియ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయవల్సిందిగా ఆమె తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అఖిల ప్రియ హెల్త్ కండీషన్ పై తక్షణమే నివేదిక అందజేయాలని జైలు వైద్యాధికారులను కోర్టు ఆదేశిస్తూ.. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలు అధికారులు అఖిలప్రియకు సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించారు. ఈ రిపోర్టులను జైలు అధికారులు సోమవారం కోర్టుకు సమర్పించనున్నారు వాటిని పరిశీలించిన తర్వాత అఖిలప్రియ బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఈ రిపోర్ట్‌లలో అఖిలప్రియ గర్భవతి కాదని వచ్చినట్లు తెలుస్తోంది. మరి స్కానింగ్ రిపోర్టులలో నెగటివ్ గా రావడంతో అఖిల ప్రియ‌కు ఈ కిడ్నాపింగ్ కేసులో బెయిల్ వస్తుందా లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా వరుస వివాదాలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్న అఖిల ప్రియకు బోయినపల్లి కిడ్నాప్ కేసుతో రాజకీయంగా కూడా పూర్తిగా చిక్కుల్లో పడిపోయారనే చెప్పాలి.

- Advertisement -