దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో మెగా బ్రదర్ నాగబాబు రాంగోపాల్ వర్మపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకు వర్మ తన వరస ట్వీట్లతో నాగబాబుపై విమర్శల వర్షం కురిపించాడు. నాగబాబు తన అన్నయ్య చిరంజీవిపై ఆధారపడతూ బతుకుతున్నాడని అదే విధంగా వరణ్ తేజ్ తన తండ్రి మాట వింటే దేనికి పనికి రాకుండా పోతావు అంటూ వర్మ తన ట్వీట్టర్ వేదికగా నాగబాబుపై విమర్శలు చేసిన సంగతి విధితమే.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యులో నాగబాబు మాట్లాడుతూ… మా అన్న చిరంజీవిపై నేను ఆధారపడి బ్రతుకుతున్నానని, అందుకు తాను ఒప్పుకుంటున్నాను,… కానీ ఊరోళ్లమీద పడి బ్రతకడం లేదు కదా అంటూ నవ్వుతూ చెప్పారు నాగబాబు. వర్మ తనపై చేసిన వ్యాఖ్యలకు సంతోషమేనని, వర్మ ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడారని నాగబాబు వ్యాఖ్యనించారు. తమ మీద పలువురు రాళ్లు వేసినప్పుడు తాము కూడా ఒక రాయి వేయాలని లేకపోతే అది తప్పు అవుతుందని చెప్పారు. తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్‌ను ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఇలానే స్పందిస్తానని నాగబాబు అన్నారు.
వర్మ చాలా గొప్ప దర్శకులని, తెలుగువారి సత్తాను ముంబైలో చాటిచెప్పి, ఉత్తర భారతీయులకు ఒక గొప్ప పాఠం నేర్పాడని …. అయితే గత ఐదారేళ్ల నుంచి ఆయన మెగా ఫ్యామిలీని గెలుకుతున్నారు… గబ్బర్ సింగ్ కాస్త బెగ్గర్ సింగ్ అయిందని అనడం తప్పు అని నాగబాబు పేర్కొన్నారు.
చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఈ గెటప్‌ను జేమ్స్ కామరూన్ చూస్తే ఆశ్చర్యపోతాడని వర్మ వెటకారం చేయడం సరికాదని ఆయన అన్నారు. తమ ముగ్గురు అన్నదమ్ముల్లో వర్మని ఎవరూ, ఎప్పుడూ ఏమీ అనలేదని… ఆయన అందరినీ అలానే అంటారని తెలుసు, కానీ తాము కామ్‌గా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు నాగబాబు. ఆయనకు ఆ రేంజ్‌లో సమాధానం చెబితే గానీ ఆనదని తనకు అర్ధమవ్వడం వల్లే అలా చేశానని అన్నారు. తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే తాను బ్యాలెన్స్ కోల్పోతానని, అది తన వీక్ పాయింట్ అని చెప్పారు నాగబాబు. చివరగా నాగబాబు మాట్లాడుతూ…తాను అనవసరంగా వర్మను టచ్ చేసి బాధపెట్టను అని ఫీలయ్యారు మెగాబ్రదర్ నాగబాబు.