ఐపీఎల్ 2020 టోర్నీలో సత్తాచాటిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసిని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని వరుణ్ చక్రవర్తి అధికారికంగా వెల్లడించలేదు. ఎలాంటి సందడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన పెళ్లి వేడుకకు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వరుణ్ పెళ్లి చేసుకున్న విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అరుణ్ కార్తీక్ సోషల్‌మీడియాలో తెలిపాడు. వివాహానికి సంబంధించిన ఫొటోను అతడు షేర్ చేశాడు.
ఐపీఎల్-2020లో కేకేఆర్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ 17 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020లో 6.84 ఎకానమీతో పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టాడు వరుణ్ చక్రవర్తి. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు కూడా ఎంపికయినప్పటికీ.. గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.