కేంద్ర చట్టాలతో రైతులతో పాటు దేశానికే ముప్పు-మంత్రి

164
Minister Jagadish Reddy
- Advertisement -

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్‌బంద్‌లో భాగంగా మంత్రి నేతృత్వంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనగామ ఎక్స్ రోడ్ వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలే బిల్లులను వ్యతిరేకిస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు ఈ బిల్లులు తీసుకువచ్చారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ సీఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రినే వ్యవసాయ చట్టాలను వ్యతిరేఖిస్తుంటే రాష్టానికి చెందిన కొంత మంది బాకా నాయకులు బిల్లును సమర్దిస్తున్నారని మంత్రి హెద్దేవా చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతాంగ సంక్షేమం కోసం రైతుబంధు, బీమా పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ తెలంగాణా రైతాంగం కోసం తెచ్చిన 24 గంటల కరెంట్ పధకానికి కూడా నూతన చట్టం ఆటంకం ఏర్పడబోతుందని మంత్రి అన్నారు. దేశ ప్రజానీకానికి నూతన చట్టం ద్వారా ఆహార కొరత రాబోతుందన్నారు.ఈ చట్టంతో రైతులతో పాటు దేశానికే పెను ముప్పు పొంచి ఉందని మంత్రి అన్నారు. గతం లో రైతులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కనీస మద్దతు ధరను నూతన చట్టంలో తీసివేశారన్నారు. నూతన చట్టాలు కేవలం కార్పోరేట్ కంపెనీలకు,వ్యాపారులకు ,దళారీలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయని మంత్రి అన్నారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే బిల్లులను కేంద్రం భేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు నష్ట పరిచే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతు గా సాధారణ ప్రజలు కలిసి రావాలన్నారు.

భారత్‌బంద్‌ సూర్యాపేటలో సంపూర్ణంగా కొనసాగింది. మంత్రి పిలుపుతో సూర్యాపేట నియోజవర్గంలో జాతీయ రహదారిపై టేకుమట్ల నుండి మాదారం వరకు ఎక్కడి కక్కడ పార్టీ శ్రేణులు,రైతులు ట్రాక్టర్‌లతో జాతీయ రహదారిని దిగ్బంధం చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా భారత్‌బంద్‌లో భాగంగా మంగళవారం వేకువ జాము నుంచే సూర్యాపేట బస్‌ డిపోఎదుట టీఆర్‌ఎస్‌ నేతలు భైఠాయించి, నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బైక్ ర్యాలీలు, పాదయాత్రలతో వేలాది మంది రైతులు కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ బడుగుల, రాష్ట్ర కార్యదర్శి వై. వీ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా దేవి, సూర్యపేట జడ్పిటిసి జీడీ బిక్షం, ఎంపీపీ రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -