బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్‌ను కంగనా రనౌత్‌కు పోటీగా శివసేన పార్టీలోకి తీసుకువస్తోందంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఊర్మిళ తాజాగా క్లారిటీ ఇచ్చారు. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. ఆ కథనాలను ఖండిస్తున్నానని ఆమె వెల్లడించారు. తాను శివసేన పార్టీలో చేరడంలేదని కరాఖండిగా చెప్పేశారు. సీఎం ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళ శివసేన కండువా కప్పుకుంటుందన్న వార్తలు ఆమె ఖండించారు.
ఊర్మిళకు రాజకీయాలు కొత్త కాదు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో దిగారు. ముంబయి నార్త్ పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు. అనంతరం ఆమె కాంగ్రెస్ కు దూరమయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె శివసేనలో చేరబోతున్నారని, గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం కూడా ఇవ్వబోతున్నారని తాజాగా కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని సీఎం ఉద్ధవ్ థాకరే సన్నిహితుడు హర్షల్ ప్రధాన్ తెలిపినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే, ఆ కథనాల్లో వాస్తవంలేదని తన వ్యాఖ్యల ద్వారా ఊర్మిళ తేల్చి చెప్పారు.