పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. చదలవాడ పద్మావతి నిర్మించిన హెడ్ కానిస్టేబుల్ చిత్రంసెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ, సాంస్కృతిక సంస్థ బల్లెం వేణుమాధవ్ అధ్వర్యంలో అభినందన సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో … దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – సమాజంలో సగటు మనిషి ఎదుర్కొంటున్న సమస్యను అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో తీసిన చిత్రమే హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. ఈ సినిమాను కథను మూడేళ్లుగా తయారు చేసుకున్నాను. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడోనని రాసుకున్న పాత్రకు నారాయణమూర్తి వంద శాతం న్యాయం చేశారు. జయసుధగారు మరోసారి తనదైన నటనతో తన పాత్రకు ప్రాణం పోశారు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని తెరపై ఆవిష్కరించగలిగాను. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు థన్యవాదాలు“ అన్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ – “ఈ సంక్రాంతి బరిలోకి వచ్చిన మమ్మల్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. నేను నలబై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ముప్పై ఏళ్లుగా సినిమాలు తీస్తూ ఉన్నాను. నేను ఇంతకు ముందు చేసిన సినిమాలు వేరు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా చేయడం వేరు. ఎందుకంటే నాపై వచ్చిన సినిమాలన్నీ ఓ బడ్జెట్‌లో ఉంటే ఈ సినిమాను శ్రీనివాసరావుగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించారు. ఈ సినిమాలో నా పాత్రను కానీ, జయసుధగారి పాత్రను కానీ ధీటుగా తెరకెక్కించడంతో ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాకు వస్తున్న క్రెడిట్ అంతా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావుగారికే దక్కుతుంది. ఈ సినిమాను ఇంకా పెద్ద సక్సెస్ చేస్తే ఇలాంటి దర్శకులు, నిర్మాతలు ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు“ అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్ సాయివెంకట్, బల్లెం వేణుమాధవ్, శరత్ జ్యోత్న్సరాణి, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.ఇప్పటి వరకు నారాయణమూర్తి చేసిన సినిమాలు వేరు, ఈ సినిమాలో నారాయణమూర్తి నటించిన తీరు వేరుగా ఉందని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్‌కు, మెమొంటోలు అందజేశారు.