ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని రెవెన్యూ సమస్యలపై సోమవారం హైదరాబాద్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి , ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్ ,చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్ రావు లతో పాటు మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించేలా.. ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కారించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని కేటీఆర్ అన్నారు. జీవో నంబర్ 58, 59 ద్వారా ప్రభుత్వ భూములు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను మాత్రమే రెగ్యులరైజ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. మిగతా సమస్యలు పరిష్కారానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదన్నారు కేటీఆర్. ఆస్తుల నమోదుకు సంబంధించి దళారులను నమ్మొద్దన్నారు. ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని కేటీఆర్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేవాదాయ, వక్ఫ్, పరిశ్రమలు తదితర భూముల్లో వివాదాల వల్ల యాజమాన్యపు హక్కు లేని భూముల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.