ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పూర్తిగా అంతం కానుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు శాసన సభలో ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతులకు కొండంత అండగా నిలిచే చారిత్రాత్మక బిల్లును తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నూతన చట్టంతో భూ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయన్న ధీమా రైతాంగంలో కనిపిస్తోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో పారదర్శకంగా, సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు.
ఈ చట్టంతో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రజల సాధక బాధకాలను దగ్గరి నుంచి చూసిన సీఎం కేసీఆర్… రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేశారన్నారు. దీంతో ప్రజలకు అవినీతి అధికారుల నుంచి విముక్తి లభించిందన్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి విప్లవాత్మకమైన చట్టం రాలేదని, గత పాలకులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు గురించి ఇంతలా ఆలోచించే సీఎం కేసీఆర్ లాంటి పాలకులను ఇన్నేండ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.
మూడు అంచెల వ్యవస్థ ఉన్న రెవెన్యూ కోర్టుల వల్ల ప్రజలపై కాలయాపన, ఆర్థిక భారం తొలగిపోనుందని, రెవెన్యూ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను ట్రిబ్యునల్ బదిలీ చేయడం వల్ల వేగంగా పరిష్కరించే వెసులుబాటు కలిగిందన్నారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చే భూ వివాదాల పరిష్కరానికి నేరుగా సివిల్ కోర్టు, హైకోర్టులనాశ్రయించ వచ్చని, దీంతో ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందని వివరించారు. ధరణీ పోర్టల్ ద్వారా తహసీల్‌ధార్ కార్యాలయాల చుట్టూ తిరగ కుండా రైతులు తమ భూములకు సంబధించిన వివరాలు ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.