కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల పీఎస్‌ని సందర్శించారు డీజీపీ మహేందర్ రెడ్డి. మావోయిస్టు అగ్రనేత గణపతి లోంగిపోతారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో డీజీపీ తిర్యాని పీఎస్‌ని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఆయనతో పాటు కీలక నేతలు కూడా లోంగుబాటు ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుండగా మావోయిస్టు పార్టీ మాత్రం లొంగుబాటు వార్తలను ఖండించింది.74 ఏళ్ల గణపతి రెండేళ్ల కిందటే అనారోగ్య కారణాలతో పార్టీ ఉన్నత పదవి నుంచి తప్పుకున్నారు. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, షుగర్ ఉన్న గణపతి ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించడంతో ఆయన లొంగిపోయేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌లో ముప్పాల గోపాల్‌రావు-శేషమ్మ దంపతుల రెండో కొడుకు గణపతి. 1950లో జన్మించిన గణపతి.. 1973లో టీచర్ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయాలతో ఆయన టీచర్ ఉద్యోగాన్ని వదిలి అడవిబాటపట్టారు.1977 సెప్టెంబరు 7న ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తపాల్‌పూర్‌లో పీతాంబర్‌రావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో పాటు గణపతి పేరూ ఉంది. అప్పట్లో 16 మందిపై కేసు నమోదైంది. ఈ కేసు ద్వారా గణపతి… మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిసింది.
1977లో జగిత్యాల జైత్రయాత్ర కోసం చందాలు వసూలు చేశారనే కేసు, ఉప్పుమడిగె రాజేశ్వర్‌రావు, చిన్నమెట్‌పల్లి జగన్మోహన్‌రావు హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆ తర్వాత గణపతి… కరీంనగర్‌లో బెయిల్ తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1979లో జిల్లా కార్యదర్శి అయ్యారు.1990-91లో పీపుల్స్‌వార్ పార్టీలో చీలికలొచ్చాయి.2005లో కొత్తగా ఏర్పడిన మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారు.చాలాకాలం బాధ్యతలు మోశారు. గణపతి తలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది.