ఆగస్ట్ 22 వినాయక చవితి. ఈ సందర్భంగా భక్తులందరూ ఆయన కథను చదివి, వినాయక వ్రత కల్పాన్ని పాటిస్తారు. ఆ విఘ్నేశ్వరుడ్ని భక్తితో కొలిస్తే జీవితంలో ఎలాంటి విఘ్నాలు కలగవనేది భక్తుల నమ్మకం. ఆ భక్తుల పనిని సులువు చేసేందుకు డాక్టర్ మోహన్ బాబు ముందుకు వచ్చారు. విలక్షణమైన కంఠానికి పెట్టింది పేరైన ఆయన వినాయక చవితి గాథను తన గళంతో వినిపించారు. దానిని ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు చవితికి ఒక రోజు ముందుగా శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశారు.
“నేను చదవడం, వినడం దగ్గర్నుంచి ప్రతి సంవత్సరం నేనిష్టపడే పండుగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండుగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితుల్ని మా ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలు చదివి, కథను వినిపించడం నాకు అలవాటు. నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు ఈ వినాయక కథను మీకు వినిపించవలసిందిగా కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుడి కథను వినిపిస్తున్నాను.” అంటూ విఘ్నేశ్వరుని కథ చెప్పడం ప్రారంభించారు మోహన్‌బాబు. ఇందులో వినాయకుని జననం, విఘ్నాలకు అధిపతి ఎవరు?, చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం: ద‌్వాపరయుగం, భాద్రపద శుద్ధ చవితి మహత్యం వంటి అంశాలను సంగ్రహంగా తెలియజేస్తూ పదిహేను నిమిషాలు పాటు ఆయన వినాయక వ్రత కల్పం వివరించారు.
మోహన్ బాబు గళంలో వినాయక పూజా విధానాన్ని వింటూ వినాయక చవితి పండుగను జరుపుకోవడం భక్తులకు ఒక మంచి అనుభవం.