ఆంధ్రపదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమనికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పంటల బీమా పరిహారం చెల్లింపుల కోసం రూ. 596.36 కోట్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. తద్వారా 5,94,005 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం వాటా రూ.122.16 కోట్లు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులందరికీ ఉచిత బీమా అందజేస్తున్నామని, 2019-20 సంవత్సరానికి ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా పథకం అమలు చేస్తామని వెల్లడించారు. చెల్లించాల్సిన ప్రీమియంలో రైతు వాటాను ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. గతంలో 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన రూ.126 కోట్లను చెల్లించలేదని ఆరోపించారు. అటు రైతులు తమ వంతు ప్రీమియం చెల్లించారని, ఇటు కేంద్రం కూడా తన వంతు చెల్లించినా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా బీమా లబ్ది రైతులకు అందలేదని సీఎం జగన్ వివరించారు.
బీమా పథకంలో మొదట రైతు చెల్లించాక మిగతా సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని తెలిపారు. అప్పుడే రైతుకు సకాలంలో బీమా మొత్తం లభిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు నష్టపోకుండా ఉండేందుకు బీమా విధానంలో పూర్తిగా మార్పులు చేసి, రైతుకు ఉచిత బీమా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ క్రమంలో రైతు సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై రైతులు ప్రశంసలు కురిపించారు. గతంలో ఎప్పుడు పంట నష్టం జరిగినా బీమా అందలేదని.. ఇంత పెద్ద మొత్తంలో బీమా సొమ్ము పొందడం ఇదే తొలిసారి అని హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు.