తెలంగాణ రాష్ట్ర్లంలోని ప్రతి విద్యార్థికి టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు అందుబాటులో ఉండాలని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు సూచించారు. ఆన్ లైన్ బోధనలో నాణ్యమైన కంటెంట్ అందించే విధంగా విద్యాశాఖ, టి-సాట్ నెట్వర్క్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యా బోధన ఆనందభరితంగా, ఆహ్లాదకరంగా ఉండేట్లుగా కంటెంట్ రూపొందించాలని, లేటెస్ట్ టెక్నాలజినీ ఉపయోగించి అన్ లైన్ విద్యలో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు దేశంలోని ప్రథమ స్థానంలో నిలవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ లోని టి-సాట్ నెట్వర్క్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కె.టి.రామారావు టి-సాట్ ప్రస్తుత ప్రసారాలు, భవిష్యత్ ప్రసారాలపై అనేక సూచనలు-సలహాలు అందించారు. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ ను అనుసరించి విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా విద్యా బోధన ఉండాలన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో ఎటువంటి సహకారం కావాలో తెలపాలన్నారు. ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగులకు పాఠ్యాంశాల బోధన, అవగాహన ప్రసారాలకు సంబంధించి టి-సాట్ విద్యా, నిపుణ ఛానళ్లు మంచి ఫలితాలు సాధించాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. శాటిలైట్ ప్రసారాలతో పాటు సోషల్ మీడియాలోనూ గత మూడు సంవత్సరాలుగా ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని, యూట్యూబ్ లో ఇప్పటి వరకు లభించిన 53.8 మిలియన్ వ్యూస్ ఛానళ్ల ప్రాధాన్యతను తెలియస్తున్నాయన్నారు.
3,95,400 సబ్ స్క్రిప్సన్స్, 5.4 మిలియన్ గంటల వాచ్ టైమ్ ఉండటం సంతోషించాల్సిన విషయమన్నారు. డి.టి.హెచ్, కేబుల్, ఆర్వోటీ, ఓటీటీ వంటి ప్రసార మార్గాలన్నింటిలో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కె.టి.ఆర్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్ లో ఆన్ లైన్ బోధనకే ప్రాధాన్యత పెరగనున్న దృష్ట్యా అవసరమైతే మరిన్ని ఛానళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్దమవ్యవాలని ఆదేశించారు. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులతో కలిసి పనిచేసే విధంగా సంయుక్త కార్యాచరణ రూపొందించాలని, అందులో భాగంగానే విద్యశాఖతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టి-సాట్ సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.