4 రాజ్యసభ స్థానాల్లో వైసీపీ ఘనవిజయం…

338
ycp
- Advertisement -

ఏపీలో నేడు నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ ఘనవిజయం సాధించింది. అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్య ఓటమిపాలయ్యారు.మొత్తం 175 ఓట్లు ఉండగా, అందులో 173 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు. వైసీపీ సభ్యులు 151 మంది, జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దీంతో వైసీపీ నలుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికి 38 చొప్పున ఓట్లు వచ్చాయి. టీడీపీకి పోలైన 21 ఓట్లలో నాలుగు ఓట్లు చెల్లలేదు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరితో పాటు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఓటు చెల్లలేదు. దీంతో వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు పడ్డాయి. ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు వైసీపీ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఇవాళ వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టి 6 గంటలకు ఫలితాలు వెల్లడించారు.

- Advertisement -