ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యారు. దేశ ఆత్మను కాపాడేందుకు ఇక తాను అధ్యక్ష పోరులో నిలవనున్నానని నామినేషన్‌లో తనకు 1991 ఓట్లు వచ్చినట్లు బైడెన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
డెమోక్రటిక్ పార్టీకి చెందిన బెర్నీ శాండర్స్ రేసు నుండి తప్పుకోవడంతో బైడెన్ రూటు సులువైంది. 77 ఏళ్ల బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ పడడం ఇది మూడవ సారి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశాధ్యక్షుడికి కావాల్సిన అన్ని అర్హతలు బైడెన్‌కు ఉన్నట్లు ఒబామా తెలిపారు.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా బైడెన్ తొలుత ఐయోవా, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత దక్షిణ కరోలినాలో జరిగిన సభతో తన ప్రచార వేగాన్ని పెంచారు. మొత్తం 14 కాంటెస్ట్‌లలో ఆయన పది గెలుచుకున్నారు.