మర్కూక్ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్…

199
kcr
- Advertisement -

కొండపోచమ్మసాగర్‌ ప్రారంభోత్సవంపై ఆరా తీశారు సీఎం కేసీఆర్. ఇందుకుసంబంధించి గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ సర్పంచ్‌ భాస్కర్‌కు సోమవారం స్వయంగా ఫోన్‌చేసి ఏర్పాట్లపై సూచనలు చేశారు. అలాగే చేబర్తి సర్పంచ్‌ అశోక్‌లతో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌: హలో భాస్కర్‌… నేను కేసీఆర్‌ను మాట్లాడుతున్న.. మర్కూక్‌లో ఏం నడుస్తుంది..? అభివృద్ధి పనులు ఎట్లున్నయ్‌.. పనులేమన్న పెండింగ్‌లో ఉన్నాయా..?

సర్పంచ్‌ భాస్కర్‌: సార్‌ నమస్కారం.. చాలా వరకు పనులు పూర్తి చేశాం. మర్కూక్‌ గ్రామ పంచాయతీ మోడల్‌ భవనం నిర్మాణం కోసం నిధులు కావాలె.

సీఎం: భాస్కర్‌ నువ్వు రందిపడకు.. మర్కూక్‌ను ఆదర్శంగా మార్చుకుందాం. అవసరమైతే మరో రూ.5–6 కోట్ల నిధులు మంజూరు చేస్తా. నువ్‌ దగ్గరుండి సమస్యలు లేకుండా చూసుకో.. అదే విధంగా రైతు వేదిక నిర్మాణం పనులు రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రారంభించుకొని ఆదర్శంగా నిలుద్దాం. ఇందుకు సంబంధించి సర్వే కూడా పూర్తి చేయించిన.

సర్పంచ్‌: సంతోషం సార్‌.

సీఎం: ఇంకా ఏం నడుస్తుంది?

సర్పంచ్‌: సార్‌… మర్కూక్‌పై మీరు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాం. కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లొస్తున్నాయని అందరూ సంబరపడిపోతున్నరు. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట చెప్పుకుంటున్నరు.

సీఎం: సంతోషం.. త్వరలోనే కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం.  రైతుల కళ్లలో ఆనందం చూడాలనేదే నా తపన. అంతే కాకుండా మర్కూక్‌ శివారులోని 14 ఎకరాల్లో పబ్లిక్‌ పార్కును ఏర్పాటు చేసుకుందాం.. వెంటనే ఆ భూమిని క్లీన్‌ చేయాలి.

సర్పంచ్‌: సార్‌.. నేను దగ్గరుండి పనులు మొదలు పెడతా. ప్రతిరోజు గ్రామంలోని వార్డులన్నీ కలియ తిరిగి సమస్యలు లేకుండా చూసుకుంటా సార్‌..

సీఎం: సరే… కొండపోచమ్మ ప్రారంభోత్సవానికి సంబంధించి భోజనాలు ఏర్పాటు చేసే స్థలం, ఇతర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకో.

సర్పంచ్‌: మంచిది సార్‌… తప్పకుండా ఏర్పాట్లలో నిమగ్నమవుతా.

సీఎం కేసీఆర్‌ తనకు ఫోన్‌ చేసి గ్రామాభివృద్ధి గురించి ఆరా తీయడంతో సర్పంచ్‌ భాస్కర్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్‌.

- Advertisement -