పోతిరెడ్డిపాడు విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు అంశంపై కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా కాంగ్రెస్ ,బీజేపీలు వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర క్రీడాఖాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవ చేశారు. పోగిరెడ్డిపాడు నీటి వివాదంపై కాంగ్రెస్,బీజేపీలు చేస్తున్న వ్యాఖలపై గురువారం టీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్‌లో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి ,అంజయ్య యాదవ్‌లు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..టీడీపీ-కాంగ్రెస్ హయాంలో ఇపుడు మాట్లాడుతున్న చాలా మంది మంత్రులుగా ఉన్నారు? ఆనాడు ఎవరు పోతిరెడ్డి పాడుపై మాట్లాడలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాయలసీమకు పోతి రెడ్డిపాడు నుంచి నీళ్లు వెళుతుంటే హారతులు పట్టారు. పోతి రెడ్డిపాడును సమర్థిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాశారు. తెలంగాణ నుంచి ఏపీకి ప్రాజెక్టులు పట్టుకుపోతే హారతులు పట్టారు.నీళ్ల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. తెలంగాణ కోసం మేము రాజీనామా చేస్తే.. దొంగ రాజీనామాలు కాంగ్రెస్ నేతలు చేశారు.
కేసీఆర్ ఆనాడు రాజశేఖర్ రెడ్డితో కుమ్మక్కు అయితే ఇవ్వాళ తెలంగాణ వచ్చేదా?.. కేసీఆర్ ఏపీ నేతలతో కలిస్తే హైదరాబాద్ తెలంగాణలో ఉండేదా?..ఏడు మండలాలు ఏపీలో కలిసాయి.. కాంగ్రెస్ కి చేతనైతే రప్పించండి. కాంగ్రెస్-బీజేపీలకు రాష్ట్రానికో స్టాండ్ ఉంటుందా?..రెండు జాతీయ పార్టీలే కదా ప్రధానిని కలిసి లేఖలు ఇవ్వండి. పీఎం మోడీ పాలమూరుకి వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాటలు మాత్రమే చెప్పారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ కి పొరుగు రాష్ట్రాలతో కొట్లాడే ధోరణి ఉంటే కాళేశ్వరం పూర్తి అయ్యేది కాదు అని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు.
పదవుల కోసం కుమ్మక్కు అయ్యే అలవాటు కాంగ్రెస్ ,ఇతర ప్రతిపక్షాలకు ఉంది చరిత్ర అదే చెబుతోంది. ప్రతిపక్షాలు ఏపీ ప్రాజెక్టు ఆపేందుకు ప్రణాళికలు చేయాలి తప్ప విమర్శలు చేయొద్దు.మహబూబ్ నగర్ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం-గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. కాంగ్రెస్-బీజేపీ నేతలు ఢిల్లీకి గులాం గిరి చేసుకుంటూ తెలంగాణ ప్రజలను ప్రజల్లా ఎప్పుడూ చూడలేదు. కేసీఆర్ ని విమర్శిస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందనే ఆలోచన మానండి.ప్రతిపక్షాలు సరిగ్గా ఉంటే-పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయ్యేది. పులులు సింహాలు అంతరిస్తాయని కోర్టుల్లో కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంది ప్రతిపక్షాలే అని మంత్రి విమర్శించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రంతో జాతీయ హోదా ఇప్పించండి ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే..పక్క రాష్ట్రాలు ఐక్యతతో ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయి. ప్రాజెక్టులపై కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడి పై ఉమ్మి వేసినట్టే. కేసీఆర్‌కు చెప్పే పోతి రెడ్డిపాడును విస్తరించేందుకు జీవో విడుదల చేశామని ఏపీ మంత్రులంటే అది తప్పే. రాజకీయం కోసమే కాంగ్రెస్ ,బీజేపీ నాయకులు అలా మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి నీటి కేటాయింపులు తగ్గించారని చేస్తున్న విమర్శలు అర్ధరహితం అని మంత్రి శ్రీనివస్ గౌడ్ పేర్కొన్నారు.