2020లో సంగీత ప్రియులను అమితంగా అలరించిన పాటల్లో ‘నీ కళ్లు నీలి సముద్రం’ ఒకటి. దేవి శ్రీప్రసాద్ కూర్చిన అద్భుతమైన ఖవ్వాలీ బాణీలకు తన మధురమైన గాత్రంతో జావెద్ అలీ జీవం పోశారు. శ్రీమణి, రఖీబ్ ఆలమ్ అందించిన సాహిత్యం ఈ పాటను ఇంత ఆకర్షణీయంగా మార్చేసింది. తాజాగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట ఒక మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అన్ని వయసుల వారూ ఈ పాటను ఆస్వాదిస్తుండటం విశేషం.
హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి.. ఇద్దరికీ ఇదే తొలి చిత్రమైనప్పటికీ ఈ పాటలో వారు ప్రదర్శించిన హావభావాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీతంలో తన అభిరుచితో, పాటలను ప్రెజెంట్ చేసిన విధానంతో డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. మరో పాట ‘ధక్ ధక్ ధక్’ ఇప్పటివరకూ 11 మిలియన్ పైగా వ్యూస్ సాధించడం చెప్పుకోదగ్గ విషయం.
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకత్వంతో పాటు కథ, సంభాషణలు, స్క్రీన్‌ప్లేలను కూడా బుచ్చిబాబు సమకూర్చిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.