ఉత్తమ్ మాటలను తీవ్రంగా ఖండించిన మారెడ్డి..

250
Mareddy Srinivas Reddy Counter Uttam
- Advertisement -

రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు, కనీస మద్దతు ధర చెల్లింపులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలను పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుల పేరుతో జిమ్మిక్కులు చేస్తే ప్రజల్లో మరింత చులకనవుతారని హితవు పలికారు. గురువారం నాడు పౌరసరఫరాల భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో బుధవారం (6వ తేదీ) సాయంత్రం నాటికి పౌరసరఫరాల సంస్థ 6188 కొనుగోలు కేంద్రాల ద్వారా 5.51 లక్షల మంది రైతుల నుంచి రూ. 5,826 కోట్ల విలువైన 31.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి రూ. 2,815 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వానికి ధాన్యం అంచనాలు సరిగా లేవని మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లాలో కలెక్టర్ నివేదిక ప్రకారం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా కాగా ఇప్పటి వరకు 5,34,588 మెట్రిక్ టన్నులు, సూర్యాపేట జిల్లాలో 4 లక్షల 80 వేల మెట్రిక్ టన్నులకు గాను 2 లక్షల 71 వేలు, యాదాద్రిలో 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నులకు గాను 1 లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. నల్లగొండలో రూ. 580 కోట్లు, సూర్యాపేటలో రూ. 3000 కోట్లు, యాదాద్రిలో రూ. 130 కోట్లు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇవి తెలుసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే బాగుండేది. డబ్బు జమ చేయడం లేదని అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడేమంటారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయని విధంగా పూర్తి పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం.కొంతమంది కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని చెపుతున్నారు. మరి అలా చేస్తే మరి అన్ని రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడుతోంది. అందుకే దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో పండిన పంటను పూర్తిస్థాయిలో కొనడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క సీజనకు దాదాపు రూ. 1000 కోట్లల వడ్డీ భారాన్ని భరిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకారం ఏమాత్రం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో గన్నీ సంచులు కావాలని స్వయంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తే కనీస స్పందన లేదు. రాష్ట్రానికి కావాల్సిన గన్నీ సంచులను తామే సమకూర్చుకోవడం జరిగింది.

రైతుల సంక్షేమమే లక్ష్యం, రైతును రాజుగా చూడాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే రైతులే క్షమించరు.మొదటి విడతగా మే 1వ తేదీ నుంచి నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ఉచిత బియ్యంతో పాటు కిలో కందిపప్పును సరఫరా చేస్తున్నాం. రెండో విడతగా మరో 7జిల్లాలు కామారెడ్డి, మహబూబాబాద్, నిర్మల్,రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి,సూర్యాపేట్,వరంగల్ అర్బన్, యాదాద్రిలో కందిపప్పును సరఫరాను ప్రారంభించామని తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో సిద్దిపేట,భూపాలపల్లి,వికారాబాద్, మంచిర్యాల్ జిల్లాల్లో ప్రారంభిస్తామన్నారు.గురువారం నాటికి 42.42 లక్షల (49%) మంది కార్డుదారులకు 1 లక్ష 65 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 1094 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేయడం జరిగిందని చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -