లాక్ డౌన్ ని క్రమశిక్షణతో పకడ్బందీగా పాటించాలని, తద్వారా కరోనా రాకుండా జాగ్రత్త పడాలని, ఆ విధంగా కరోనాని నిర్మూలించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ లోని బంజారహిల్స్ రోడ్ నెంబర్ 12లో గల మంత్రుల నివాస ప్రాంగణంలోని ఉద్యానవనం, గన్ మెన్, గార్డెనింగ్, పారిశుద్ధ్య తదితర విభాగాలకు చెందిన కార్మికులందరికీ మంత్రి మంగళవారం స్వయంగా నిత్యావసర సరుకులను అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా వైరస్ ప్రపంచం మొత్తమ్మీద ఓ విపత్తుని కలిగించిందన్నారు. ఈ విపత్తు నుంచి బయట పడడానికి లాక్ డౌన్ ఒక్కటే మందుగా కనిపిస్తున్నదన్నారు. అందుకే అందరికంటే ముందే సీఎం కెసిఆర్, లాక్ డౌన్ విధించారని, తద్వారా దేశం సహా, ప్రపంచంలో అందరికంటే మన రాష్ట్రమే కరోనా నివారణలో ముందుందన్నారు. మెరుగైన ఫలితాలు కూడా సాధించగలిగామని చెప్పారు. మన రాష్ట్రంలో అతి తక్కువ ప్రభావం ఉందని, ఇదంతా సిఎం గారి నిర్ణయాలు, ప్రజల సహకారంతోనే సాధ్యపడిందన్నారు.