రాష్ట్రంలో వ్యవసాయం మరింత బలోపేతం..

481
Minister Niranjan Reddy On Crop Developments
- Advertisement -

రాష్ట్ర సమగ్ర వ్యవసాయ విధానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు సమగ్ర వ్యవసాయ విధానం-ప్రత్యామ్నాయ పంటలు-లాభదాయక సాగుపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం మరింత బలోపేతం కావాలని..సమాజంలోని అన్ని వర్గాలు దీని మీదనే ఆధారపడ్డాయన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీదనే అత్యధిక శాతం ప్రజలు ఉపాధి పొందగలుగుతారు. సాగునీరు, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు పథకాలు, ధాన్యం సేకరణతో తెలంగాణ రైతులలో ఆత్మవిశ్వాసం నింపింది. రైతు తాను బతికితే చాలనుకున్న స్థితి నుండి పది మందిని బతికించగలను అన్న స్థాయికి వచ్చాడు. పడావుపడ్డ భూములు శిస్తులోకి వచ్చాయన్నారు.

మన ప్రధాన వనరు వ్యవసాయం.. మన ప్రజల ఆహార అవసరాలేంటి ? జరుగుతున్న ఉత్పత్తి ఏంటి ? తెలుసుకోవాలి. పక్క వారితో పోటీపడే స్థాయికి మన మార్కెటింగ్ విధానం ఎదగాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే రకాల మీద దృష్టి సారించాలి. ఎక్కువ దిగుబడి, ఎక్కువ లాభం వచ్చే వంగడాలను రైతులకు అందించాలి. ప్రత్యామ్నాయ ఆదాయ పంటలు చూయిస్తేనే రైతులు సాగుకు మొగ్గు చూపుతారు. ఆయిల్ పామ్ సాగుతో నిరంతర ఆదాయం వస్తుంది. నాలుగేళ్ల వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు.. చీడపీడల బెడద కూడా ఉండదు.ప్రత్యామ్నాయ పంటలలో ఆయిల్ పామ్ ను మొదటిపంటగా సూచించవచ్చని మంత్రి తెలిపారు.

Minister Niranjan Reddy On Crop Developments

ఏటా 70 వేల కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్నాం .. దీన్ని తగ్గించుకునేందుకు ఆయిల్ సీడ్స్ కు కేంద్రం ప్రోత్సాహమిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకప్పుడు ఇసుర్రాయి లేని ఇళ్లు లేకుండే. జొన్నరొట్టె, జొన్నగట్క, జొన్న, తైద అంబలి అప్పట్లో ప్రధాన ఆహారం. ప్రస్తుతం వాటి సాగుతో రైతులకు తగినంత ఆదాయం లభించడం లేదు. అందుకే సాగుకు ఆసక్తి చూపడం లేదు. అలాంటి పంటలను ఎలా లాభసాటి చేయాలి? అలోచించాలి. వీలున్నంత వరకు విత్తన పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి. దేశంలో 1/3 విత్తనాలను తెలంగాణనే సరఫరా చేస్తుంది.

ఉత్తర తెలంగాణలో నువ్వులు, ఆవాల విత్తనోత్పత్తి చేస్తే ఉపయోగకరం.. వీటికి మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందిస్తాం. సన్నరకం వడ్లు విత్తనోత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచాలి. వచ్చే వానాకాలం కనీసం 25 లక్షల ఎకరాలలో సన్నరకాల వడ్లు సాగుచేయాలి. అందుకు తగినట్లు ప్రణాళిక సిద్దం చేద్దాం.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను రైతులు సమగ్రంగా వినియోగించుకుంటున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి. ఏం చేస్తే రైతులు లాభపడతారో సమగ్రంగా చర్చించాలి. మీ సూచనలు, సలహాలను బట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కాళేశ్వరం రాకతో యాసంగిలో 40లక్షల ఎకరాలలో వరి సాగయింది.ప్రత్యామ్నాయ, లాభదాయక పంటల వైపు రైతులను మళ్లించాలి అని మంత్రి గంగుల తెలిపారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, పౌరసరఫరాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కమీషనర్ సత్యనారాయణ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల, సీడ్స్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.

- Advertisement -