రాష్ట్రంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు, జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కరోనా వ్యాప్తి పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు సరిగ్గా అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమలవుతున్న సహాయక చర్యలను ఆరా తీశారు. కంటైన్మెంట్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాల సరుకులు అందచేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ సోకి గాంధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మరణాలు రేటు జాతీయ సగటుకన్నా తక్కువ వుండడం కొంత ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని సిఎం అన్నారు.
‘‘సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశ వ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా రేపటి కాన్ఫరెన్స్ లో అభిప్రాయాలు వస్తాయి. తద్వారా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.