రంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాధి నివారణకై మొత్తం పాలనా యంత్రాగం నిర్విరామ శ్రమచేస్తూనే హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కోటి ఇరవై ఒక లక్షల మొక్కలను నాటడం జరిగింది. ప్రస్తుత కారోనా సంక్షోభ కాలంలో కరోనా నివారణ విధులకు ప్రాధాన్యత నిస్తూనే జిల్లాలో హరితహారం మొక్కల సంరక్షణకు కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ మొక్కల సంరక్షణ వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని గ్రామ పంచాయితీ, మున్సిపల్, పంచాయితీ రాజ్ తదితర శాఖలు మొక్కలకు వాటరింగ్ చేయడం, ట్రీ గార్డులు ఏర్పాటు లేదా మొక్కల చుట్టూ సరైన రక్షణ చర్యలను చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హరితహారం మొక్కల సంరక్షణ చర్యలను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఆర్దీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ లను ఆదేశించారు. ప్రధానంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయితీ సిబ్బంది వాటర్ ట్యాన్కర్ ల ద్వారా హరితహారం మొక్కలకు నీరును పోయాలని పేర్కొన్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద 21.62 లక్షల మొక్కలు నాటగా వీటిలో ఇప్పటికి 20 .63 లక్షల మొక్కలను అంటే 85 శాతం సంరక్షించడంలో జిల్లా పాలనా యంత్రాంగం విజయవంతమైంది. వచ్చే మూడు నెలల కాలం కూడా ప్రతీ మొక్కకు నీరు పోసి బతికించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడం తో వీటి మనుగడపై ప్రత్యేక కృషి చేస్తున్నారు అధికారులు.