కరోనా నేపథ్యంలో ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తోన్న తమపై దేశంలోని పలు చోట్ల కొందరు దాడులకు పాల్పడుతుండడంతో వైద్యులు ఈ రోజు నిరసనకు దిగారు. వైద్యులపై కొందరు ఉమ్మివేస్తూ, దుర్భాషలాడుతోన్న ఘటనలపై వైద్యాధికారులు మండిపడుతున్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా రేపు బ్లాక్డే పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఈరోజు రాత్రి 9 గంటలకు ఆసుపత్రుల్లో క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలపనున్నారు. దీనికి వైట్ అలర్ట్ అని పేరు పెట్టారు. దీంతో ఈ రోజు ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులతో హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో కృషి చేస్తున్న వైద్యుల బృందానికి అమిత్ షా అభినందనలు తెలిపారు.
వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షా భరోసా ఇచ్చినట్లు హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించనున్నట్లు అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలిపింది. నిరసన కార్యక్రమాలు ఆపాలని వైద్యులకు అమిత్ షా సూచించారు. దీంతో ఆందోళన చేపట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.