ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటనే మానవ మనుగడ సాధ్యమని, లేకపొతే కరోనా లాంటి వైరస్ లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ. పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రాణకోటికి అనూకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, భూ గ్రహాన్ని సంరంక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, సునామీలు, భూకంపాలతో పాటు కొత్త కొత్త వ్యాధులు ఇవన్ని కూడా పర్యావరణానికి మనం చేస్తున్న హాని వల్లేనని గ్రహించాలని సూచించారు.
పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే వివిధ వైరస్లు సోకడం ముమ్మరమవుతుందనేది మహ్మమ్మారి కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని ఈ సందర్బంగా తెలిపారు. మానవ తప్పిదాల వల్లే వైరస్ లు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైరస్ లను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పర్యావరణ విధ్వంసం మూలాన గతంలో ఎబోలా, మెర్స్, నిఫా, సార్స్, బర్డ్ ఫ్లూ, ఎబోలా లాంటి వ్యాధులు సంభవించిన విషయం మనందరికీ తెలిసిందేనని, ఇప్పుడు కొత్తగా కరోనా.. ఇలా మానవులను వరుస పెట్టీ పీడిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నాళ్లకు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆరోగ్యంపై ప్రభావం చూపి మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భూమిపై ఉన్న జీవరాశులు మనిషి లేకుండా బతుకుతాయని, కానీ మనిషి జీవరాశులు లేకుండా మనుగడ సాధించలేదని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచడాన్ని ఉద్యమంలాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. చెట్టు అంటే కలప కాదు, అదొక జీవ వ్యవస్థ అని గ్రహించాలి. మానవ జాతిని ఇన్ని కోట్ల సంవత్సారాలు సంరక్షిస్తున్నది అడవులతో కూడిన జీవ వ్యవస్థని గుర్తించాలి. అందుకే ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఉన్న చెట్లను సంరక్షించండి, కొత్తగా మొక్కలను నాటండి అని పిలుపునిచ్చారు.