ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది రకరకాల వెంటిలేటర్లు తయారు చేశామంటూ ముందుకు వస్తున్న తరుణంలో టీ వర్క్స్, దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సంస్థలతో కలిసి తక్కువ ఖర్చుతో ఒక పూర్తి స్థాయి వెంటిలేటర్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం టీ వర్క్స్ టీమ్‌తో పాటు క్వాల్కమ్, హనీవెల్ , జి ఈ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఆ సంస్థల ఇంజనీర్లతో కలిసి తయారుచేసిన వెంటిలేటర్ ఈ రోజు మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న పరిస్థితుల్లో వైద్య రంగానికి చెందిన పరికరాల తయారీ కోసం దృష్టి నెలకొని ఉన్న నేపథ్యంలో టీ వర్క్స్ వెంటిలేటర్ తయారు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెంటిలేటర్‌కి సంబంధించిన వివరాలను టీ వర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరి మంత్రి కేటీఆర్‌కు వివరించారు. దీని తయారీలో అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో టీ వర్క్స్ దాదాపు 20 మంది యువ నిపుణులతో కలిసి 30 రోజుల పాటు కష్టపడి ఈ వెంటిలేటర్ ని తయారు చేసిందని, ఇందుకోసం అనేక ప్రోటోటైప్ పరికరాలను ఉపయోగించి, పలుమార్లు వాటిని పరిశీలించి ప్రస్తుత నమూనాను తయారు చేయగలిగామని, ఇందుకోసం నిమ్స్ వైద్యుల అవసరాలు ,సలహాలు, సూచనల మేరకు ఈ వెంటిలేటర్ ని రూపొందించామని తెలిపారు. తాము రూపొందించిన ఈ వెంటిలేటర్ దాదాపు 35 వేల రూపాయల ఖర్చు లో అందుబాటులోకి వస్తుందని, ఈ వెంటిలేటర్ ద్వారా తక్షణమే అవసరమైతే రోగులకు సేవలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
రానున్న రోజుల్లో ఈ వెంటిలేటర్‌ను మరింత చౌకగా, మరిన్ని అత్యుత్తమ సౌకర్యాలతో రూపొందించబోతున్నమని, ఇప్పటికే ఈ వెంటిలేటర్ తయారీ పైన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని సుజయ్ మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఈవెంటిలేటర్తో రోగికి అవసరమైన సేవలు అందించేందుకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు తాము ఈ వెంటిలేటర్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ప్రస్తుత ఆపత్కాలంలో ప్రముఖ సంస్థలతో కలిసి ఇంత తక్కువ కాలంలో తక్కువ రేటుతో అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన ఒక పూర్తిస్థాయి వెంటిలేటర్ ని తయారు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ టీ వర్క్స్ ను అభినందించారు. ఇందులో పాలుపంచుకున్న సభ్యులను, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను, ఇంజనీరింగ్ మరియు మెకానికల్ నిపుణులను మంత్రి కేటీఆర్ అభినందించారు. జిహెచ్ఎంసిలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసిఉద్దీన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లు ఉన్నారు.