పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే ప్రజలు ఆరోగ్యనగా ఉంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో పర్యటించారు. ముందుగా మంత్రి పట్టణంలో అపరిశుభ్రత కారణంగా ఇటీవల ప్రజలు వైరల్ ఫీవర్ బారిన పడుతున్న ప్రాంతాలను తనిఖీ చేశారు .వైరల్ ఫీవర్ వచ్చేందుకు ఉన్న అవకాశాలను, పరిశుభ్రత లోపాలను పరిశీలించారు. వైరల్ ఫీవర్‌తో మరణించిన బాలుడు అరవింద్ ఇంటికి వెళ్లి తల్లి ప్రమీలమ్మను పరామర్శించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి సామాజిక ఉద్యమాన్ని తీసుకు వచ్చారని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అనంతరం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన విషయం విధితమే అని అన్నారు.ఈ కాలంలో కొన్ని ప్రాంతాలలో విపరీతమైన అపరిశుభ్రత, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రజలు వైరల్ జ్వరాలకు గురయ్యే అవకాశం ఉందని, ఆ విధంగానే అమరచింత పట్టణంలో కొంతమంది ప్రజలు వైరల్ ఫీవర్ బారిన పడినట్లుగా తెలిపారు.
అయితే కేవలం ఇద్దరు మాత్రం శ్వాస కోస ఇబ్బందితో చనిపోయారని, తక్కిన వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని,వారందరిని త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తో పాటు ,వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండటమే ఆరోగ్యానికి ప్రధాన కారణమని ప్రజలు ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. పట్టణంలో అపరిశుభ్రతను రూపుమాపేందుకు ఇదివరకే మున్సిపాలిటీ ద్వారా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు అనేకమార్లు మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు వైరల్ ఫివర్ బారిన పడడం దురదృష్టమని అన్నారు .ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని, అంతేకాక మాస్కులు ధరించాలని ,వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అంతేకాక వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ,మున్సిపల్ చైర్మన్ మంగమ్మ నగభూషన్ గౌడ్, వైస్ చైర్మన్ గోపి, కౌన్సిలర్లు లావణ్య,విజయారములు, రాజశేఖర్ రెడ్డి,రమేష్ యాదవ్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసులు,డిపివో రాజేశ్వరి, డిఆర్డీవో గణేష్, మున్సిపల్ కమిషనర్ మోహన్ ఇతరఅధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంతకు ముందు మంత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద చెత్త బుట్టలు పంపిణీ చేశారు.