నల్లగొండ లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగులకు,మీడియా ప్రతినిధులకు ఒక్కోక్కరికి 5కేజీల చొప్పున బత్తాయి పండ్లను ఉచితంగా పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ సైదిరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటీల్, యస్పీ ఏ.వీ రంగనాధ్ లు ఈ కార్యక్రమానికి హజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనాను నిరోధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని,ప్రతి ఒక్కర్ని తమ కన్నబిడ్డల్లా చూసుకుంటున్న సీఎం కేసీఆర్ గొప్ప మనస్సును దేశ వ్యాప్తంగా వివిధ రంగాల ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారని జగదీష్ రెడ్డి అన్నారు.
ఇదే రకంగా తెలంగాణా సమాజం ఒక్క తాటిపై నిలబడి కరోనాపై చేస్తున్న యుద్దంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. కరోనాను కట్టడి చేసే విషయంలో భారత దేశం గోప్ప విజయాన్ని సాదించిందని, భారత దేశ సనాతన ధర్మం, జీవన శైలి,సంస్క్రుతి సంప్రదాయాలు, అందుకు దోహదపడ్డాయని మంత్రి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.
కరోనా నియంత్రణకు మిటమిన్ సీ ని అందించే బత్తాయి, నిమ్మ పండ్లను ప్రతి ఒక్కరు తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. పాజిటీవ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో జన సంచారాన్ని పూర్తిగా నిషేధించామని, వారికి ఇంటి వద్దకే కూరగాయలు, నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఇంటి నుంచి బయటికి రావొద్దని మంత్రి కోరారు.