తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకెళ్తోంది. రాష్ట్రంలో గురువారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 45 కు చేరాయి. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
వైరస్ నియంత్రణపై ఈ రోజు ప్రగతి భవన్‌లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి కట్టడిపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సామాజిక దూరాన్ని కూడా పాటించి.. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రజలందరూ లాక్‌డౌన్‌లో భాగంగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.