దేశంలోనే మొదటిది మన కోరంటి (క్వారంటైన్) ఆసుపత్రి..

785
Fever Hospital
- Advertisement -

ప్రకృతి వైపరీత్యాలు, అంటురోగాలు ప్రపంచాన్ని, మానవ సమాజాన్ని అప్పుడప్పుడు అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. వాటి దాటికి కొన్నిసార్లు మనిషి దగ్గర సమాధానం ఉండదు. అప్పటి హైదరాబాదు రాష్ట్రం కూడా ఈ విపత్తులకు అతీతమేమి కాదు. కాని వీటిని నివారించడంలో, ఎదుర్కోవడంలో నిజాం నవాబులు చూపిన నిబద్దత, ముందుచూపు ప్రశంసనీయం. 1908 సెప్టెంబరు 28న మూసినదికి వచ్చిన వరదలు నగరాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నింటినో అతలాకుతలం చేసాయి. ‘తుగ్యాని సితంబర్’ అని స్థానికులచే పిలవబడే ఈ వరదలు దాదాపు యాభైవేల మంది ప్రజల ప్రాణాలు బలిగొంది.

అయితే ఈ వరదల వలన సంభవించిన కాలుష్యం కారణంగా హైదరాబాదులో ఎన్నో అంటురోగాలు ప్రబలాయి. కొత్త కొత్త జ్వరాలు, గత్తర ( కలరా) హైదరాబాదులో వ్యాపించి మరణాల సంఖ్యను రెట్టింపు చేశాయి. వీటి నివారణ, చికిత్స కోసం 1915 లో నగరానికి దూరంగా ఈరన్నగుట్ట దగ్గర ఒక చిన్నపాటి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇలా ఆ రోగుల నుంచి ఇతరులకు రోగాలు సోకకుండా ఆయా రోగులను క్వారంటైన్ లో ఉంచే పద్దతి ప్రారంభించారు. అందుకే దీనిని అప్పట్లో Quarantine Hospital (క్వారంటైన్ హాస్పిటల్ ) అని పిలిచేవారు. అలా దేశంలో మొదటి క్వారంటైన్ ఆసుపత్రి ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది ‘కోరంటి’ హాస్పిటల్ గా ప్రసిద్ధి చెందింది.

తరువాత 1923 లో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోకి ఈ ఆసుపత్రిని మార్చారు. 1927-28 మధ్యకాలంలో ఈ ఆసుపత్రిలో మొదటిసారిగా వ్యాధుల నిర్ధారణకు ఒక ప్రయోగశాలను ప్రారంభించారు. హైదరాబాదు ప్రాంతం ఉష్ణమండల ప్రదేశం కావడంతో ఇక్కడ మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా,డిఫ్తీరియా, డయేరియా, మిజిల్స్, గవదబిళ్ళలు వంటివి ఎక్కువ వ్యాపించే అవకాశం ఉండేది. అయితే ఏ వ్యాధి వచ్చినా వాటి సాధారణ లక్షణం జ్వరం. ఈ ఆసుపత్రికి వారు జ్వరంతోనే వస్తారు ‌కాబట్టి ఈ ఆసుపత్రిని ఫీవర్ హాస్పిటల్ (Fever Hospital) అని పిలవడం మొదలైంది. దాదాపు పదమూడున్నర ఎకరాలలో నిర్మించబడిన ఈ ఆసుపత్రి వంద సంవత్సరాల నుంచి ఎందరో పేదరోగులకు వైద్య సేవలందిస్తూనే ఉంది. 1997లో సర్ రొనాల్డ్ రాస్ శతజయంతిని పురస్కరించుకొని ఈ ఆసుపత్రికి Sir Ronald Ross Institute of Tropical and Communicable Diseases అని పేరు పెట్టారు. ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా నగర అభివృద్ధిలో భాగంగా నగరం నడిబొడ్డుకు చేరుకుంది. చుట్టుపక్కల నల్లకుంట, విద్యనగర్, తిలక్ నగర్, బర్కత్ పుర అంబర్ పేట్ లు ఏర్పడి ఫీవర్ హాస్పిటల్ కు ప్రత్యేకతను సమకూర్చాయి.

హైదరాబాదు స్థానికులే కాకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తుంటారు. 2005 శంకుస్థాపన చేయబడి 2011 నుండి ఇక్కడ పనిచేస్తున్న వైరాలజీ ల్యాబ్ అత్యంత అధునాతనమైనది. అనేక రకాల ఇన్ఫెక్షన్ లకు, రోగాలను ఇక్కడ పరీక్షిస్తారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు ముందు పరీక్షల కోసం రోగ నిర్ధారణల కోసం పూణేకు నమూనాలను పంపేవారు. వీటి రిపోర్టులు రావడానికి నెలకు పైగా సమయం పట్టేది. ఇది కాలయాపనతో కూడుకున్నదే కాకుండా కొన్నిసార్లు రోగుల ప్రాణలకు ముప్పు వాటిల్లేది. మొదట్లో ఏడు వార్డులతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం తొమ్మిది వార్డులతో దాదాపు 330 పడకలు ఉన్నాయి. ప్రతిరోగానికి విడివిడిగా వార్డులుండడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతిరోజూ దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల బయటి రోగులు (Out Patients) ఇక్కడికి వస్తారు. అంటే ఏడాదికి దాదాపు రెండున్నర లక్షలు. అంతేకాకుండా పదిహేను వేల మంది లోపలి రోగులు (In Patients) లకు సేవలందిస్తుంది. రోగుల సేవకోసం ఇక్కడ 30 నుంచి 35 మంది డాక్టర్లు, 270 కి పైగా ఇతర సిబ్బంది ఉన్నారు. వైద్యం కార్పోరేట్ మయమైన నేటికాలంలో పేదలకు వైద్య సేవలందిస్తున్న ఈ ఆసుపత్రి హైదరాబాదులో ప్రముఖమైంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో క్వారంటైన్ అనే పేరు చాల పాపులర్ అయ్యింది. వంద సంవత్సరాల క్రితమే దేశంలో మొదటి క్వారంటైన్ ఆసుపత్రి అయిన మన ఫీవర్ హాస్పిటల్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఆ ఆసుపత్రి స్థాపకులకూ, అందులో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మనమిచ్చే కనీస గౌరవం.

- Advertisement -