కేటీఆర్ ది గ్రేట్ అని కొనియాడారు ప్రముఖ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు. తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా వివరించారు. ఈ సాయంత్రం ఒక బ్లాగు మిత్రులు శ్యామల రావు గారు ఫోన్ చేసారు. వారి శ్రీమతికి వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయించాలి. భార్యాభర్తలు ఇరువురూ వృద్ధులు. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి మధ్యలో కొరానా కర్ఫ్యూ. ఆయనకి కాళ్ళూ చేతులు ఆడక నాకు ఫోన్ చేశారు. నేను మాత్రం ఏం చేయగలను? ఆలిండియా రేడియో నుంచి రిటైర్ అయి ఇప్పటికి పుష్కరం గడిచింది. నా మాట ఎవరు వింటారు. అంచేత ఓ సలహా ఇచ్చాను.
కేటీఆర్ గారికి ట్వీట్/ వాట్సప్ చేయండని. ఆయన అలాగే చేశారు. నిమిషం గడవక ముందే ‘Will take care’ అని జవాబు వచ్చింది. మరి కాసేపటిలో కానుగుల శ్రీనివాస్ అనే ఆయన వారికి ఫోన్ చేసి చిరునామా నోట్ చేసుకున్నారట. ఆ ముసలి దంపతుల ఆనందం ఇంతా అంతా కాదు.
“ముందు మీ సలహా విని తప్పించుకోవడానికి అలా చెప్పారని అనుకున్నా. కానీ ఫోన్ వచ్చేసరికి నా చెవులను నేనే నమ్మలేకపోతున్నా. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ప్రభుత్వ స్పందన అద్భుతం” ఫోనులో చెబుతున్నారాయన, కానీ ఆయన కంటి వెంట కారుతున్న ఆనంద భాష్పాలు ఆ మాటల్లో నాకు కనబడుతూనే వున్నాయి. సామాన్యులు కృతజ్ఞత తెలిపే విధానం ఇలాగే వుంటుంది.
‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని వారెప్పుడు మరచిపోరని చెప్పారు.