తెలంగాణ రాష్ట్రాన్ని లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా అనవసరంగా రోడ్లపై తిరగిన వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. లాక్ డౌన్ రూల్స్ ను కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు పిలుపునిచ్చారు డిజిపి మహేందర్ రెడ్డి. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. తెలంగాణ సమాజం కోసమే పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఆటోలు, క్యాబ్ లు బయట తిరిగితే సీల్ చేస్తామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిథిలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కిరాణా షాపులు, కూరగాయాల దుకాణాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు కిరాణా, కూరగాయల దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని, ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారని హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ప్రతి బైక్ పై ఒక వ్యక్తి… ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. పోలీసులు, ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.