మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వ పరంగా చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేసేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞఫ్తి చేశారు నగర మేయర్ బొంతు రామ్మోహన్ . సోమవారం పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద రూ. 5.95 కోట్లతో నిర్మించేందుకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జి పునాధి పనులను అధికారులతో కలిసి మేయర్ పరిశీలించారు. ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజ్ నుండి నాగార్జున సర్కిల్ వరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం శ్మశానవాటిక పై నుండి వెళ్లే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.
శ్మశానవాటికలోని సమాదులకు ఎటువంటి నష్టం జరగకుండా పనులను పూర్తిచేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. పునాధులకు తవ్విన మట్టిని కూడా ఇష్టమొచ్చినట్లు వేయరాదని స్పష్టం చేశారు. పునాధులలో 5మీటర్లు ఉన్నప్పటికీ పై భాగాన స్టీల్ బ్రిడ్జి వెడల్పు 11 మీటర్లు ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జి పనులను జులై లోపు పూర్తిచేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఈ పర్యటనలో సెంట్రల్ జోన్ ప్రాజెక్ట్స్ ఎస్.ఇ జ్యోతిర్మయి, ఏ.సి.పి కృష్ణ కుమార్, డి.ఇ. వెంకటకిరణ్ తదితరులు పాల్గొన్నారు.