ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు.
ఇక భారత్ – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ సందర్భంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ వన్డే సిరీస్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ అని తెలిపింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించబోమని..మూడో వన్డేకి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది.
ఒక్క బీసీసీఐ(క్రికెట్)కే కాదు.. దేశంలోని అన్ని స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కి ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ఐపీఎల్ 2020 సీజన్ వరకూ ఈ నిబంధన కొనసాగుతుందా..? అనేదానిపై స్పష్టత రావడం లేదు. ప్రేక్షకుల్ని రానివ్వకపోయినా తాము మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ప్రకటించాయి.
మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. మే 24న ఫైనల్‌తో ఈ టోర్నీ ముగియనుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏప్రిల్ 15 వరకూ పర్యాటక వీసాల్ని కేంద్రప్రభుత్వం రద్దు చేయడంతో విదేశీ క్రికెటర్లు ఆడతారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.