తమిళనాడు తాగునీటి సమస్య పరిష్కరిస్తా: సీఎం కేసీఆర్

324
cm kcr
- Advertisement -

తమిళనాడు రాష్ట్రానికి తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో తమిళనాడు అధికారుల బృందం భేటీ అయింది. సీఎంను కలిసిన తమిళనాడు బృందంలో మంత్రి ఎస్పీ వేలుమణి, డీ జయ కుమార్, పీడబ్ల్యూడీ కార్యదర్శి మణి వాసన్, సలహాదారు డా. శ్రీమతి ఎం శీలప్రియ ఉన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ తమిళనాడు తాగునీటి సమస్య గురించి తాను కూడా నీతి ఆయోగ్ సమావేశాల్లో అనేకసార్లు లెవనెత్తానని తెలిపారు. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా రెండు, మూడుసార్లు తమిళనాడు తాగునీటి సమస్యను ప్రస్తావించారని గుర్తు చేశారు. తమిళనాడులో తాగునీటి సమస్య దీర్ఘకాలంగా పరిష్కారం కానందుకు దేశం మొత్తం సిగ్గుపడాలన్నారు.

70000 వేల టీఎంసీల నీటి వనరుల్లో దేశవ్యాప్తంగా వ్యవసాయ అవసరాలు పోను 30000 ల టీఎంసీల మిగులు నీటి వనరులు ఉన్నాయి అని తెలిపిన సీఎం..దీంట్లో కనీసం మరో 10000 వేల టీఎంసీల నీటిని వాడుకున్నా దేశవ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాల్సి ఉందని..తమిళనాడు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై దేశవ్యాప్తంగా అవగాహన అవసరం అన్నారు. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉంటాయని చెప్పారు.

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిసలైన భారతీయుడిగా నేను తమిళనాడు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని..తమిళనాడు తాగునీటి సమస్య గురించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు కేసీఆర్. తమిళనాడు సమస్య పరిష్కారానికి తాను సూచించిన మార్గాలను ఏపీ సీఎంతో షేర్ చేశారు కేసీఆర్.

తమిళనాడులో తాగునీటి సమస్య దీర్ఘకాలంగా నెలకొని ఉన్న విషయం తెలిసిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సహకారం అందించాల్సిన అవసరాన్ని ఏపీ సీఎంకు నొక్కి చెప్పారు. తమిళనాడు బృందంతో భేటీలో మంత్రి కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగరావు, స్మితా సబర్వాల్, సీఎమ్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -