ప్రముఖ క దర్శకురాలు, సినీనటి విజయ నిర్మల కాంస్య విగ్రహనికి నివాళులు అర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు నరేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల(73) ఏళ్ల వయసులో మృతిచెందారు. తమిళనాడులో 1946 ఫిబ్రవరి 20వ తేదీన విజయనిర్మల జన్మించారు. విజయ నిర్మల నటుడు సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి. ఏడేళ్ల వయస్సులో బాలనటిగా తమిళచిత్రం మత్స్యరేఖతో అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయస్సులో పాండురంగమహత్యం చిత్రంలో తెలుగులో విజయనిర్మల పరిచయం అయ్యారు. విజయనిర్మల తండ్రిది చెన్నై కాగా, తల్లి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు.

‘రంగులరాట్నం’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేసిన విజయనిర్మల దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, కురుక్షేత్రం, తదితర చిత్రాల్లో నటించారు. ‘పెళ్లి కానుక’ సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు.
మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయ నిర్మల. కృష్ణతో కలిసి 47 చిత్రాల్లో ఆమె నటించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల గిన్నిస్ రికార్డు సాధించారు.

