తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర పార్టీల నాయకులు చేస్తున్న విష ప్రచారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా వెల్లడించిన వాస్తవాలతో నిజం నిగ్గు తేలిపోయిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.నిప్పులాంటి నిజాలను దాచాలని ఎవరూ చూసిన అవి దాగవని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విస్పష్ట ప్రకటన చేశారని ఆయన అన్నారు. దీన్ని చూసైనా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ఇతర విపక్షాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని వినోద్ కుమార్ హితవు పలికారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు గోబెల్స్ ప్రచారాన్ని కట్టి పెట్టాలని ఆయన సూచించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని వినోద్ కుమార్ అన్నారు.ఆరేళ్ళలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ. లక్షన్నర కోట్లు మాత్రమేనని, ఇది ఏడాదికి సగటున రూ. 25 వేల కోట్లేనని ఆయన వివరించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి రూ. 19, 205 కోట్ల ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేసినా.. కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిషన్ కాకతీయ పథకానికి రూ. 5 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని కూడా నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసినా బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరుగలేదని ఆయన పేర్కొన్నారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా రాష్ట్రానికి రూ.450 కోట్లు వచ్చేవని, కానీ ఈసారి బడ్జెట్ లో ఆ నిధులకు కేంద్రం కోత పెట్టిందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత చూపుతోందని వినోద్ కుమార్ ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గోరంత అయితే గొప్పలు మాత్రం కొండంతగా చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే శుష్క వాగ్ధానాలు – శూన్య హస్తం అన్న చందంగా ఉందని ఆయన చెప్పారు.రాష్ట్ర రెవెన్యూ మొదటి నుంచి మిగులే ఉందని, పరిమితిలోనే రాష్ట్ర అప్పులు ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదన్న విషయాలు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో తేలిపోయాయని వినోద్ కుమార్ తెలిపారు.వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్, బీజేపీ నాయకులు, విపక్షాలు నోరు మూసుకోవాలని బోయినపల్లి వినోద్ కుమార్ హితవు చెప్పారు.