తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే నవోదయ, కేంద్రియ విద్యాలయాలను మంజూరు చేయాలన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. రాజ్యసభలో జీరో అవర్ లో ఎంపీ లింగయ్య యాదవ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం 32 జిల్లాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రములోని అన్ని జిల్లాలకు వెంటనే జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయాలి.
నేటికి 21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు, 17 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయలేదన్నారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికి నిధులు మంజూరు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన మూడు సైనిక స్కూల్స్ వెంటనే ఈ విద్యా సంవత్సరంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద విద్యార్థుల విద్యాభివృద్ది కొరకు అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.