మాజీ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా జడ్చర్ల డా. బి. ఆర్. ఆర్. ప్రభుత్వ కళాశాల బొటానికల్ గార్డెన్‌లో మొక్కలు నాటారు. అనంతరం ‘మనం సైతం’ కాదంబరి కిరణ్, కళాశాల వృక్షశాస్త్ర సహయాచార్యులు డా.సదాశివయ్య, జూనియర్ కళాశాల అధ్యాపకులు ఎం.రఘురాం కలసి సుమారు 300 మంది విద్యార్థులతో మొక్కలు నాటించారు. MP జోగినపల్లి సంతోష్ కుమార్ నడుం కట్టిన గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రతి పౌరుడూ కొనసాగించాలంటూ, MP సంతోష్ కుమార్ ని “అభినవ కృష్ణదేవరాయలు”గా కాదంబరి కిరణ్ అభివర్ణించారు.
ఈనాడు నాటిన మొక్కలతో నిండే ఈ గార్డెన్ విశేషమేమంటే 4.5 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఈ గార్డెన్ తెలంగాణ రాష్ట్రాన్ని పోలి ఉండటమే కాకుండా, ప్రతి జిల్లా బోర్డర్ స్పష్టంగా కనబడతాయి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన మొక్కలుండటం విశేషం. సుదూర ప్రాంతాలు, వివిధ అడవుల నుంచి సేకరించిన విశేషమైన మొక్కలతో ఈ ప్రాంగణం. “హరిత తెలంగాణ”ను తలపిస్తుందని, గుభాళిస్తుందని ప్రిన్సిపాల్ డా. గోవింద్ భూషణ్ తెలిపారు.
ఈ కార్యక్రమము కొరకు ప్రత్యేక శ్రద్ధతీసుకుని హైద్రాబాద్ నగరం నుంచి వచ్చిన గ్రీన్ ఛాలెంజ్ సైనికుడు కాదంబరి కిరణ్ ని లక్ష్మారెడ్డి మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో దొరిపల్లి రవీందర్ సహా లక్ష్మారెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్ శ్యామల, పరిశోధక విద్యార్థులు, ఎన్ఎస్‌ఎస్ యూనిట్ 2 అండ్ 3 వాలంటీర్లు,విద్యార్థులూ వందల సంఖ్యలో పాల్గొన్నారు.