నా కల నెరవేరింది- బోయినపల్లి వినోద్ కుమార్

637
b vinod kumar
- Advertisement -

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐ. టీ. పరిశ్రమలు ప్రారంభం కావడంతో తన కల నెరవేరిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ లో ఐ టీ పరిశ్రమలను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఐ. టీ. రంగ ప్రతినిధులు, పలువురు ప్రొఫెసర్లు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో వినోద్ కుమార్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి చేదోడువాదోడుగా ఉండాలన్న తన లక్ష్యం నెరవేరిందని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

2004-09లో హన్మకొండ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో టైర్-2 స్కీంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే ఐ.టీ. సెజ్ లను ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. వరంగల్ జిల్లాలోనూ ఐ టీ సెజ్ ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి లేఖ రాయడమే కాకుండా.. ఐ టీ సెజ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయ్యే దాకా తన ప్రయత్నాన్ని నిరంతరంగా కొనసాగించానని వినోద్ కుమార్ తెలిపారు.

అప్పట్లో ఐ టీ సెజ్‌కు స్థల సేకరణ జరిగినా.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత భవనాలు పూర్తి అయ్యాయని, ప్రస్తుతం సెయింట్, టెక్ మహీంద్రా వంటి ఐ టీ కంపెనీలు వరంగల్ జిల్లాలో ఏర్పాటు అయ్యాయని వినోద్ కుమార్ వివరించారు. మున్సిపల్ ఎన్నికల వల్ల వాయిదా పడిన కరీంనగర్ ఐ టీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దశల వారీగా ఐ. టీ. పరిశ్రమలు త్వరలోనే ఏర్పాటు అవుతాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఐ. టీ. రంగంతోపాటు బీపీఓ విభాగంలోనూ రాష్ట్రంలోని గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తొలి దశలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోని గ్రామీణ యువతకు ఐ. టీ. రంగంలో ఉపాధిని కల్పించి.. రెండో విడతలో మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. బ్యాక్ ఆఫీసు పనితో ఐ. టీ. రంగంలో చిరు ఉద్యోగాలకూ అవకాశాలు ఉంటాయని వినోద్ కుమార్ అన్నారు.

- Advertisement -