రైతు బిడ్డ కూడా రైతు కావాలనే రోజు రావాలి..

547
pocharam
- Advertisement -

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసరుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లి సీడ్ ఫారంలో జరిగిన “కిసాన్ మేళా-2019” లో భాగంగా జరిగిన “యంత్రాలతో వరి నాటే విధానం-అవగాహన” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 1.50 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉండగా 1.10 కోట్ల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు. అన్ని రంగాలలో ఉన్నట్లే రైతు బిడ్డ కూడా తాను రైతు కావాలనే రోజు రావాలి. ఈ ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాకున్నా 20 సంవత్సరాల క్రితం ముందుచూపుతో నిర్మించిన కళ్యాణి, సింగీతం రిజర్వాయర్ల ద్వారా ఈ ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులోని మొత్తం భూములలో పంటలు సాగు చేసుకోగలిగామన్నారు.

అంతేకాదు భవిష్యత్తులో వీటన్నింటికి పరిష్కారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి మళ్ళించి ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మొత్తం 7లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా రైతులకు డబ్బులను సహాయంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మనుషులు ద్వారా కాకుండా యంత్రాల సహాయంతో వరి నాటడం ద్వారా 70 శాతం పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా దిగుబడి పెరుగుతుందని పోచారం అన్నారు.

2014 కంటే ముందు ఈ బొప్పాస్ పల్లి విత్తన క్షేత్రం నిర్లక్ష్యానికి గురైంది. పంటలు సాగు చేయక తుమ్మచెట్లు మొలిచాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఈ క్షేత్రానికి వైభవం తీసుకువస్తున్నాం. రూ. 4 కోట్లతో సీడ్ ప్రాసేసింగ్ యూనిట్ నిర్మిస్తున్నాం. సాగునీటి సరఫరా కోసం రూ. 65 లక్షలతో నిజాంసాగర్ కాలువ నుండి ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మించామని పోచారం తెలిపారు. కాగా అంతకుముందు సీడ్ ఫారంలో రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మించిన ADA కార్యాలయం, గెస్ట్ హౌస్ ను స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -