నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మత్స్యకారుల ఆర్థికాభివృద్దికి ఫిష్ మార్కెట్, యువతకు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ప్రారంభంతో పాటు నగరవాసులు మరింత సులభంగా ప్రయాణించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు నేడు కూకట్‌పల్లి నియోజకవర్గంలో చేపట్టారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంబిపూర్ రాజు, శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్‌కుమార్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి తో కలిసి కూకట్‌పల్లి నియోజకవర్గంలో గురువారం నాడు రూ. 101.69 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను కె.టి.రామారావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రివర్గ బృందానికి చిత్తారమ్మబస్తీ డబుల్ బెడ్‌రూం లబ్దిదారులు బతుకమ్మలు, బోనాలు, బాణాసంచాతో ఘనంగా స్వాగతం పలికారు.
హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్‌రూం రంగంలో మూడో ప్రాజెక్ట్ అయిన చిత్తారమ్మ బస్తీలో రూ. 9.34 కోట్ల వ్యయంతో నిర్మించిన 108 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నేడు ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు కె.టి.ఆర్, మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి లబ్దిదారులతో కలిసి పాలు పొంగించి సామూహిక గృహప్రవేశం చేయించారు.