జయలలితకు నివాళి ఘటిస్తూ నటుడు కమల్ హాసన్ పోస్టు చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఒకవైపు జయలలిత మృతి పట్ల ఆమె అభిమానులు, తమిళ ప్రజలు అశ్రునయనాలతో సంతాపం తెలియజేస్తున్న వేళ కమల్ వారిని హేళన చేస్తున్నట్టుగా పెట్టిన ట్వీట్ పై వివాదం రేగుతోంది. కమల్ తీరును అమ్మ అభిమానులు ఖండిస్తున్నారు. ట్విటర్ ద్వారానే నెటిజన్లు కమల్‌పై విరుచుకుపడుతున్నారు.
కమల్ తమిళంలో పోస్టు చేసిన ఆ ట్వీట్ లో “జయలలిత మీద ఆధారపడి బతుకున్న వారి పట్ల తీవ్రమైన సానుభూతి..’’ అని పేర్కొన్నాడు. కమల్.. జయలలిత సంక్షేమ పథకాలను హేళన చేస్తూ ఇలా స్పందించి ఉండవచ్చు. లేదా.. మరేదైనా ఉద్దేశం ఉండవచ్చు. ఏదేమైనా.. ఇంకా అంత్యక్రియలైనా పూర్తి గాక ముందే.. ఇలాంటి ట్విట్లు చేయడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
జయపై అభిమానిస్తున్న వారందరినీ.. ఆమెపై ఆధారపడ్డ వ్యక్తులు అనడం ఈ హీరోకి తగదు. ఈ విషయంలో అభిమానుల నుంచినే నిరసనను ఎదుర్కొంటున్నాడు నటుడు కమల్ హాసన్. ‘నీకు అభిమానిని అయినందుకు సిగ్గుపడుతున్నా..’’ అంటూ కమల్ ట్వీట్‌కు రీట్వీట్లు చేస్తున్నారు ఆయన ఫాలోవర్లు.
ఈ సందర్భంలో జయతో కమల్ కు నెలకొన్ని కొన్ని విబేధాలు గుర్తురాకమానవు. ‘విశ్వరూపం’ సినిమా సమయంలో కమల్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందనే మాటలు వినిపించాయి. అంతకు ముందు చిదంబరానికి అనుకూలంగా కమల్ మాట్లాడుతూ.. ‘పంచె కట్టిన వాడు.. ఈ దేశానికి ప్రధాని కావాలి..’ అని వ్యాఖ్యానించడంతో చీరకట్టు జయకు కోపం వచ్చిందని.. దానికే జయలలిత ‘విశ్వరూపం’ సమయంలో కమల్ కు విశ్వరూపం సినిమాకు అడ్డంకులు సృష్టించిందని తమిళనాడులో చెప్పుకుంటారు.