తెలంగాణ రాష్ట్ర రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే అమీన్ పూర్ కు మంచినీళ్లు వచ్చాయన్నారు మంత్రి హరీశ్ రావు. పటాస్ చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండలం బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట్ వరకు రూ.49కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. బీరంగూడగుట్టపై రూ.69కోట్లతో హెచ్‌ఎండబ్ల్యూఎస్ నిర్మించిన 30లక్షల లీటర్ల రిజర్వాయర్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… అమీన్ పూర్ అక్కా చెల్లెళ్లకు ఇవాళే నిజమైన పండగు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అమీన్ పూర్ ఆడపడచులు నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో దేశంలోనే నెం1 రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 20ఏళ్ల వరకు మంచినీటి సమస్యరాకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు భీమా పథకాలతో సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని చెప్పారు. ఉద్యమనాయకుడు ముఖ్యమంత్రి కావడం వల్లే ఇవన్ని సాధ్యమయ్యాయని తెలిపారు.