ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను రోడ్లపైగాని, చెత్తకుప్పల్లో గాని, నాలాల్లో వేయకుండా వాటిని మీ ఇంటి వద్దనుండే సేకరించే కార్యక్రమాన్ని ఆదివారం నుండి పదిరోజుల పాటు జిహెచ్ఎంసి చేపట్టనున్నది. ఈ నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నవంబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు పదిరోజుల పాటు ఇళ్లలో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇతర నిరుపయోగ వస్తువులను ఈ ప్రత్యేక డ్రైవ్‌లో సేకరించనున్నది. ఇందుకుగాను ప్రతి సర్కిల్లో ఈ పనికిరాని వస్తువులను సేకరించి వాటిని నిలువచేయడానికి ప్రత్యేక స్థలాలను గుర్తించారు.
ఆదివారం ఉదయం నుండి జిహెచ్ఎంసికి చెందిన ప్రత్యేక వాహనాలు పలు కాలనీ, బస్తీలలో తిరిగి పనికిరాని వస్తువులను సేకరించనున్నందున వాటిని జిహెచ్ఎంసికి అందజేయాలని అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. పదిరోజుల పాటు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఒకరోజు ఆయా కాలనీలకు జిహెచ్ఎంసి వాహనాలు వస్తాయి. లేదా ఎంపికచేసిన స్థలాల్లోనూ ఈ అనవసర వస్తువులను వదిలివెళ్లవచ్చు. ప్రస్తుతం నగరంలో ఈ పనికిరాని వస్తువులన్నింటిని రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారు. తద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు జామ్ కావడంతో రోడ్లపై మురుగునీరు పొంగడం, నాలాల ద్వారా నీరు సక్రమంగా ప్రవహించకుండా రహదారులు జలమయం కావడం నగరంలో సాధారణంగా మారింది.
ఇటీవల నగరంలోని ఖాళీ స్థలాలు, పార్కులు, రహదారులవెంట ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి విజయవంతంగా నిర్వహించింది. తద్వారా ఇటీవలకాలంలో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల నాలాలు, డ్రెయిన్లు, మ్యాన్‌హోళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు తక్కువగా ఉండడంతో వరదనీరు సక్రమంగా పారేందుకు అవకాశం ఏర్పడింది. ఇదేమాదిరిగా ప్లాస్టిక్ ఏరివేత వల్ల వచ్చిన సత్ఫలితాల దృష్ట్యా ఇళ్లలోని వృథా వస్తువులను కూడా సేకరించేందుకు జిహెచ్ఎంసి ప్రణాళికలు రూపొందించింది. దాదాపు 10రోజుల పాటు కొనసాగే ఈ డ్రైవ్‌లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేసన్లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నారు.
ఇందుకుగాను ఆర్.డబ్య్లూ.ఏలు, ఎన్.జి.ఓలు, మహిళా సంఘాలను కూడా ఈ డ్రైవ్‌లో భాగస్వాములను చేసి నిరుపయోగ వస్తువులన్నింటిని జిహెచ్ఎంసికి అందజేయాలని విజ్జప్తి చేశారు. కాగా ఈ నిరుపయోగవస్తువుల సేకరణకు ప్రతి డివిజన్లో ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసినందున ఆయా స్థలాలకు ఈ వస్తువులను తెచ్చి వేయవచ్చని కూడా జిహెచ్ఎంసి విజ్ఞప్తి చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్కుగాను ప్రత్యేక సిబ్బందిని కూడా కేటాయిస్తూ జిహెచ్ఎంసి ఆదేశాలు జారీచేసింది.