సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు 15 రోజుల్లో కొత్త రోడ్డు వేయాలని పంచాయతీ రాజ్ శాఖ, వైద్య శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి శివారులో రూ.135 కోట్ల వ్యయంతో నిర్మితమైన సిద్ధిపేట ప్రభుత్వ కొత్త వైద్య కళాశాల క్యాంపస్ కు విద్యార్థులు చేరిన దరిమిలా జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, వైద్య అధికారుల బృందంతో కలిసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ మేరకు మెడికల్ వైద్య కళాశాలలోని విద్యార్థులతో మమేకమై కలుపుగోలుగా మాట్లాడుతూ.. మీ చదువులు ఏలా సాగుతున్నాయని., క్లాసులు మంచిగ జరుగుతున్నాయా..? సెమిస్టర్లు విషయమై., కళాశాల ఎట్లా ఉన్నదని, ఇంకేమైనా సౌకర్యాలు కావాలా..? అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై మెడిసిన్ విద్యార్థినీలు నెట్ వర్క్ సిగ్నల్ సరిగ్గా ఉండటం లేదని సెల్ టవర్ వేయించాలని అందులోనూ జియో నెట్ వర్క్ కావాలని కోరగా., మంత్రి ప్రతి స్పందిస్తూ.. చదువులు పక్కన పెట్టి ఇంటర్నెట్ లో మునిగిపోతారని చెబుతూ.. తప్పకుండా త్వరలోనే సెల్ టవర్ వేయిస్తానని భరోసా ఇచ్చారు. వీటితోపాటు రోడ్డు సౌకర్యం, జిమ్, విద్యుత్, తాగునీటి వసతి తదితర మౌళిక సదుపాయాలు కల్పన గురించి విద్యార్థులు తెలుపగా యుద్ధప్రాతిపదికన చేయించాలని టీఎస్ ఎంఎస్ఐడీసీ డీఈఈ విశ్వ ప్రసాద్, వైద్య అధికారులను ఆదేశించారు.
అందరూ బాగా చదువుకోవాలని కళాశాలకు, మీ తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని కోరుతూ.. మెడిసిన్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతకు ముందు అడ్మినిస్ట్రేటీవ్ బ్లాక్, సెంట్రల్ లైబ్రరీ హాల్, కాన్ఫరెన్స్ హాల్ గదులను పరిశీలించారు. మిగులు అసంపూర్తి పనులపై ఆరా తీస్తూ.. అక్కడికక్కడే పరిశీలన చేస్తూ కావాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ద్వితీయ విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నూతనంగా చేరిన విద్యార్థులకు జరిపే వెల్ కమ్ పార్టీకి రావాలని మెడిసిన్ విద్యార్థులు మంత్రిని ఆహ్వానించగా., తప్పకుండా వస్తానని మాట ఇచ్చారు. కళాశాల ఆవరణలో ఆకుపచ్చ మయంగా
బ్యూటీఫికేషన్ బాగా ఉండాలని చెట్లు నాటాలని సూచించారు. అనంతరం రోడ్డుకు ఇరు పక్కల డ్రైనేజీలు, మొక్కలు నాటేందుకు స్థలాన్ని గ్రీనరీకి వదిలిన తర్వాతనే సెట్ బ్యాక్ నిబంధనలు పాటిస్తూ సుడా, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు సూత్రప్రాయంగా అధికారులను ఆదేశించారు. కోమటి చెరువు, ఎన్సాన్ పల్లి శివారు లోతట్టు ప్రాంతమని ఎప్పుడైనా వరదలు వస్తే సమస్యలు రాకుండా ముందు నుంచే జాగ్రత్త వహించి అనుమతులు ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయించినట్లు వెల్లడించారు.